బీజేపీ నేతలపై నిప్పులు చెరిగిన "లిబర్హాన్"
దేశంలో మత సామరస్యానికి విఘాతం కలిగించిన బాబ్రీ మసీదు కూల్చివేతకు 68 మంది వ్యక్తిగతంగా కారకులని లిబర్హాన్ కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. అటల్ బిహారీ వాజ్ పాయి, సీనియర్ బిజెపి నాయకులు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శివసేన అధిపతి బాల్ థాక్రే వేరిలో ఉన్నారంది. ఉత్తర ప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్, విశ్వహిందూ పరిషత్ నాయకులు అశోక్ సింఘాల్, ప్రవీణ్ తొగాడియా, ఆర్ ఎస్ ఎస్ మాజీ అధిపతి కెఎస్ సుదర్శన్, గోవిందాచార్య, స్వర్గీయ విజయరాజే సింథియా, వినయ్ కతియార్, ఉమా భారతి, సాధ్వీ రితాంబర పేర్లు కూడా లిబర్హాన్ దోషుల జాబితాలో ఉన్నాయి. వీరితో పాటు కొందరు అధికారులు అంటే భద్రత ఐజి ఎకె సరన్, ముఖ్య కార్యదర్శి వికె సక్సేనా వంటివారు కూడా దోషులేనని కమిషన్ పేర్కొంది. మంగళవారం ఈ నివేదికను కేంద్ర హోం మంత్రి చిదంబరం పార్లమెంట్ ఉభయసభల్లో ప్రవేశపెట్టినపుడు సభలో పెద్ద రభస జరిగింది. రెండు సభల్లోనూ బిజెపి సభ్యులు ఆందోళనకు దిగారు. రాజ్యసభలో అయితే బిజెపి- సమాజ్ వాదీ పార్టీ సభ్యులు కొట్టుకునేవరకూ వచ్చింది. పరిస్థితి చేయి దాటి రాజ్యసభను వాయిదా వేయవలసి వచ్చింది. నివేదకను చిదంబరం చదవడం ప్రారంభించగానే బిజెపి సభ్యులు 'జైశ్రీరాం' నినాదాలు ప్రారంభించారు. సమాజ్ వాది నేత అమర్ సింగ్ ఈ నినాదాలు ఆపాలని అరుస్తూ బిజెపి సభ్యుడు అహ్లువాలియా పైకి దూసుకుపోయి ఆయన్ను తోసేశారు. దాంతో మిగతా సభ్యులు లేచి గుమికూడటంతో సభ మార్కెట్ గా మారింది. ఉద్రిక్తత తలెత్తి ఘర్షణ నెలకొనడంతో సభను వాయిదా వేశారు. ఈ నివేదికను ప్రవేశపెట్టే ముందు కేంద్ర మంత్రి వర్గం అత్యవసర భేటీ చోటు చేసుకుంది. ప్రధాని మన్మోహన్ దేశంలో లేనందున ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ భేటీకి అధ్యక్షత వహించారు. తప్పుకి చెంపలేసుకున్న అమర్ సింగ్రాజ్యసభలో తన వల్ల పొరపాటు జరిగిందని సమాజ్ వాదీ నేత అమర్ సింగ్ అంగీకరించారు. తాను అహ్లువాలియాకు క్షమాపణలు చెప్పడానికి సిద్ధమన్నారు. అహ్లూవాలియాను నెట్టడం తన ఉద్దేశం కాదని, అది పొరపాటున జరిగిందని చెప్పారు. తాను కూడా రాముని భక్తుణ్ణేనని అమర్సింగ్ చెప్పారు. కాగా కమిషన్ నివేదక లీక్ అయిన ఉదంతంపై సంయుక్త పార్లమెంటు కమిటీని నియమించాలని బిజెపి నాయకుడు మురళీ మనోహర్ జోషీ డిమాండ్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment